ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో పారదర్శకత – వదంతులను నమ్మవద్దు: మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి
———————————————————————-
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు/డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు విషయంలో ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.1,00,000/- డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత లబ్ధిదారురాలిని పిలిపించి విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా సంబంధిత మున్సిపల్ సిబ్బందిని కూడా విచారించగా, మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, తనను ఎవరూ డబ్బులు అడగలేదని, తాను కూడా ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించలేదని లబ్ధిదారురాలు స్పష్టం చేసినట్లు కమిషనర్ తెలిపారు. అయితే, ఒక గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రూ.1,00,000/- అడిగినట్లు ఆమె తెలిపిందన్నారు.
ఈ విషయంపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో మున్సిపల్ సిబ్బందికి ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించబడినట్లు కమిషనర్ తెలిపారు.
గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా IAS గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, డ్రా విధానం ద్వారా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
కాబట్టి ప్రజలు ఆధారాలు లేని వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఎవరైనా ఇళ్ల మంజూరు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా లేదా అనుమానాస్పదంగా వ్యవహరించినా సంబంధిత ఆధారాలతో జనగామ మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అటువంటి ఫిర్యాదులపై విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
— మున్సిపల్ కమిషనర్
జనగామ మున్సిపాలిటీ

