ఆత్మకూరు, జూన్ 12 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణంలో సొంత ఇల్లు అవసరమైన అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ శుక్రవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
నెల్లూరుపాలెం సమీపంలోని టిడ్కో గృహ సముదాయంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్లాట్లకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. టిడ్కో గృహాల్లో మొత్తం 91 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.ఇందులో 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సింగిల్ బెడ్‌రూమ్ ప్లాట్లు 27, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు 64 ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జత చేసి మున్సిపల్ కార్యాలయంలో గానీ, సంబంధిత వార్డు సచివాలయంలో గానీ సమర్పించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి గృహాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గృహాల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.టిడ్కో గృహాలపై ఇతర వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా ఫోన్ నెంబర్ 801981369 ద్వారా సమాచారం పొందవచ్చని సూచించారు.సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ కోరారు.


