
అవును…. వారిద్దరు ఒక్కటయ్యారు…. నెల్లూరు, అక్టోబర్ 10 (పున్నమి విలేకరి) : అవును వారిద్దరు ఒక్కటయ్యారు…. ఇదేదో సినిమా టైటిల్‌లో లేకుంటే వ్యవహారిక పదమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏపీలోని రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరులో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఐక్యతారాగం. దాదాపు ఆరు నెలల నుంచి నిన్నమొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ కూడా చేశారు. అంతే…పార్టీ అధినేత రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యేలనేగా మీ సందేహం. వారే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైవుంటుంది వీరిద్దరి మధ్య గొడవేంటో… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడమే రాజకీయ లౌక్యం అంటారు పెద్దలు. గతమేమో గాని ఇటీవల నెల్లూరుజిల్లాలో నెలకొన్న కొన్ని సంఘటనలు అక్కడి రాజకీయ నాయకుల ఆంతర్యాన్ని బైటపెట్టాయి. ఇటీవలి రాజకీయాల్లో కృష్ణార్జునులుగా పేరుగాంచిన బావబామర్దులు గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల రాజకీయ వైరం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న కాకాణిపై నిప్పులు చెరిగిన రూరల్ ఎమ్మెల్యేకోటంరెడ్డి అధినేత సయోద్యతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. తూచ్… మేమిద్దరం సన్నిహితులం… కుటుంబ బాంధవ్యమే కాదు, బాల్యమిత్రులమంటూ కాకాణి పై శ్రీధర్ రెడ్డి ప్రేమ ఒలకబోశారు. మరోవైపు తమ ఇద్దరి మధ్య కేవలం అవగాహన లోపమే కాని, అనుబంధం చెక్కుచెదరలేదంటూ శ్రీధర్ రెడ్డి బావ కాకాణి కాకాపట్టారు. దీంతో ఎమ్మెల్యేలిద్దరి మధ్య వివాదం పై నిన్నమొన్నటి వరకు కత్తులు నూరుకున్నా కేడర్ మాత్రం ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ప్రత్యేకించి వివాదం తారాస్థాయికి కారణమైన అధికారిణి సరళా మాత్రం సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేల వివాదానికి రాజకీయాలే కాదు, కొన్నివ్యక్తిగతమైన అంతర్గత విభేదాలున్నట్లు జిల్లాలో గతం నుంచే చర్చ జరుగుతోంది. గత టీడీపీ హయాంలో నెలకొన్న కొన్నిరాజకీయ పరిణామాలు కాకాణి ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల్లో శ్రీధర్ రెడ్డి ప్రత్యర్థికి సపోర్టు చేశారన్నది కాకాణి వర్గీయుల వాదన. ఆ విభేదం తారాస్థాయికి చేరి రియల్ ఎస్టేట్‌లో బహిర్గతమైంది. నెల్లూరు జిల్లాలో బావబామ్మర్దులుగా బాంధవ్య భావాలున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గత కొద్దికాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై అక్కడి స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు న్యాయపరమైన చిక్కులు తెచ్చాయి. తన పై గోవర్ధన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి కేసు వేశారు. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంలో తనకు స్వయాన బావమర్ధిగా పేరున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అప్పట్లో సోమిరెడ్డికి సపోర్టుగా నిలిచారన్నది కాకాణి వాదన. ఇదే సమయంలో రూరల్ ఎమ్మెల్యేకు చెందిన కొన్ని వ్యక్తిగత విషయాల్లో కాకాణి జోక్యం చేసుకుంటున్నారంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే కాకాణి పై గుర్రుగా వుంటూ వచ్చారు. అధికార పార్టీలో పవర్‌పుల్ లీడర్లుగా ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వివాదం ఈ మధ్య రచ్చకెక్కింది. ఓ రియల్ ఎస్టేట్‌కు నీళ్ల వ్యవహారంలో అక్కడి ఎంపీడీవో సరళాదేవి అనుమతులు ఇవ్వలేదంటూ రూరల్ ఎమ్మెల్యే ఆమె పై ఆగ్రహించారు. నివాసానికి వెళ్ళి మరీ హెచ్చరికలు చేశారు. తమ నియోజకవర్గంలో అధికారిణిపై రూరల్ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారన్న వ్యవహారం పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి అరికాల్లో కాలింది. తమ అనుచరుల ద్వారా అధికారిణితో రూరల్ ఎమ్మెల్యే పై కేసులు పెట్టించారు. దీంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. అధికారిణి పై ఎమ్మెల్యే ఆగ్రహించారన్న సమాచారం అధినేతకు చేరడంతో ఆయన భగ్గుమన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, చర్యలు తీసుకోండి అంటూ అధికార యంత్రాంగాన్ని ఆపార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పాలనాధిపతి నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం పోలీసులు నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప్పు నిప్పుగా మారడం, పార్టీలో గందరగోళానికి కూడా దారితీసింది. ఇది కాస్తా పార్టీ డ్యామేజి అయ్యే స్థాయికి వెళ్లిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మహిళా అధికారిణి వనజాక్షి పై దెందులూరు ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ ఘటన కళ్ళ ముందు సాక్షాత్కారిస్తుండడంతో ప్రస్తుత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకవైపు పార్టీ పై దురభిప్రాయాన్ని పోగొడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అధినేత అరెస్ట్ చేయించారన్న సంకేతాన్ని సాధారణ ప్రజల్లోకి వెళ్లేలా ఒక చర్య, మరో వైపు గొడవ కొనసాగితే జిల్లాలో కేడర్ గందరగోళం పడుతుందన్న విధానానికి స్వస్తి పలుకుతూ సయోధ్య కుదర్చడంతో వైసీపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే మధ్య జరిగిన వివాదాన్ని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తన మార్కు రాజకీయంతో సర్దుబాటు చేశారు. బట్ ఈ సయోధ్య ఎంత వరకు కొనసాగుతుంది అన్నది వేచిచూడాల్సిందే…

