నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల అరవపల్లె-2 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం కార్యకర్త ఎన్. లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చిన్నారుల పోషణపై అవగాహన కల్పించడంతో పాటు, బాలింతలు, విద్యార్థినీ విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యతపై చర్చ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న కార్యకర్తలు, ఆశా దీదీలను సత్కరించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, ఈ అంశంపై తల్లిదండ్రులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


