అనపర్తి, జూలై 17 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇన్‌చార్జిగా నల్లమిల్లి మనోజ్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి పెద్దల నిర్ణయానుసారం భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి పదవికి తాజాగా నల్లమిల్లి మనోజ్ రెడ్డిని పార్టీ నియమించింది.
మనోజ్ రెడ్డి నియామకంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు మరింత వేగం చేకూరుతుందని, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



