అచ్చెన్న లేని అసెంబ్లీ !
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు… మాటల యుద్దాలు, వాకౌట్లు… గందరగోళాలు చోటు చేసుకుంటుంటాయి. ఎక్కువ రోజులు జరగాల్సిన సమావేశాలు ఈసారి కరోనా నేపధ్యంలో కుదించబడ్డాయి. కేవలం రెండు రోజులు మాత్రమే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక అసెంబ్లీ అనగానే కొంతమంది నేతలు కళ్ల ముందు మెదులుతుంటారు. వాళ్ళు ఫైర్ బ్రాండ్లు. అధికార పక్షం నుంచి చూస్తే కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా, ప్రసన్నకుమార్ రెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ కనిపిస్తారు. ఇక సీఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గొంతెత్తితే ఎదుటివారికి చాకిరేవు తప్పదు. ఇక ప్రతిపక్ష పార్టీ విషయానికి వస్తే అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప వంటి సభ్యులు గుర్తుకొస్తారు. అయితే ఈ సారి అచ్చెన్నాయుడు లేని అసెంబ్లీ కనిపించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు పాల్గొనాలి. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశాలకు టీడీఎల్పీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడు హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో, మరో ఉపనేత నిమ్మల రామానాయుడుని బీఏసీకి వెళ్లి, టీడీపీ వాదన వినిపించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆయన బీఏసీ సమావేశానికి వచ్చారు. ప్రతిపక్షంలోని టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో మాట్లాడే సత్తా ఉన్న వారు మాత్రం కొద్దమందే. వారిలో చంద్రబాబుకి రైట్ అండ్ లెఫ్ట్ గా వుంటుంది అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి మాత్రమే. ఇక ఈ ఇద్దరిలో ముందుగా ఒకరి పేరు చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అచ్చెన్నాయుడు పేరునే చెప్పాలి. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వుంటే ఆ తీరే వేరు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన వాదనను బలంగా వినిపిస్తుంటారు. ఎంతటి వారిపైనైనా సరే నోరేసుకుని పడిపోతుంటారు. చర్చ ఎలాంటిదైనా ప్రత్యర్థులను దుమ్మెత్తిపోయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయన రూటే సెపరేటు. అలాంటి అచ్చెన్న ఈసారి అసెంబ్లీలో కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆయన మాత్రం రిమాండ్ లో వుండాల్సివచ్చింది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే అచ్చెన్నను అక్రమంగా అరెస్టు చేయించిందంటూ టీడీపీ వాదిస్తోంది. ఏదేమైనా అచ్చెన్న లేని అసెంబ్లీ కాస్త బోసిపోయినట్లే కనిపిస్తోంది.