ఎందరో మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని, వారి త్యాగాలు మరువలేనివని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుబాహాన్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట మండలం మలకాటపల్లె సమీపంలోని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమాములు, మౌజనులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు తమవంతు సహకారం అందించడం ట్రస్ట్ లక్ష్యమని అబ్దుల్ సుబాహాన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారని, వారి పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కులం, మతం అనే భేదాలు లేకుండా అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరికీ దైవం ఒక్కడేనని పేర్కొన్నారు. సమాజంలో పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, ఇమాములు, మౌజనులు, స్థానికులు పాల్గొన్నారు.


