భద్రాచలం: సాయిబాబా ఆలయంలో స్వర్ణ సింహాసనం ఏర్పాటు కోసం వృక్ష మిత్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. భద్రాచలం పట్టణాన్ని హరిత భద్రాద్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో గత 15 ఏళ్లుగా బృందంతో కలిసి భూపతి రావు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మొక్కలు నాటడం, పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భూపతి రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి కేటాయించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. కార్యక్రమంలో చారుగుళ్ల సుబ్బారావు, ఆలయ కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.



