వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సత్తుపల్లి ప్రాంత రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఖమ్మం జిల్లాలో నెలకొన్న పంటల పరిస్థితిని వివరించారు. సాగర్ ఆయకట్టులో పంటలు ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా మరో రెండు మూడు రోజుల్లో సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీటి కొరత లేకుండా చూడాలని సత్తుపల్లి నియోజకవర్గ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడంతో సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది.



