మంథని సీఐ బి. స్వామి
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2026 గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంథని పోలీసు స్టేషన్లో గురువారం సీఐ బి. స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ ల ఆధ్వర్యంలో మంథని పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ ఆరిఫోద్దీన్, మంథని మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని అధికారుల సమక్షంలో నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి బహిరంగ మండపం, శోభాయాత్ర వివరాలను policeportal.tspolice.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మండపం లోపల రెండు బాక్స్ రకం స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉందనీ, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు వాడకూడదనీ, కేవలం భజనలకు మాత్రమే పరిమితం చేయాలనీ స్పష్టం చేశారు. రాజకీయ నినాదాలు, మద్యం వినియోగం, లక్కీ డిప్లు, బలవంతపు విరాళాల సేకరణ పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కనీసం ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి పేర్లను రిజిస్టర్లో నమోదు చేయాలనీ, పవర్ బ్యాకప్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చాలనీ అన్నారు. ప్రభుత్వం గుర్తించిన స్థానిక చెరువుల్లోనే నిమజ్జనం చేయాలనీ, విగ్రహానికి ఒక వాహనం మాత్రమే ఉపయోగించాలనీ, నిమజ్జన వాహనాలపై డిజేలు లేదా స్పీకర్లకు అనుమతి లేదని తెలియజేశారు. అలాగే విద్యుత్ శాఖ నుంచి అనుమతి పొందిన కనెక్షన్లు మాత్రమే వాడాలనీ, విద్యుత్ వైర్ల హుకింగ్ చేయకూడదనీ, మండపాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.


