జర్నలిస్టుల ఒత్తిడికి.. మెడిటేషన్ తో పరిష్కారం
శాంతి సరోవర్ సదస్సు
—ప్రెస్ అకాడమీ చైర్మన్
శ్రీనివాస్ రెడ్డి,
రాజయోగిని కుల్దీప్ దీదీ
————————————
జనగామ, మే30,పున్నమి ప్రతినిధి:
సమాజంలోని వివిధ రంగాలలో అలాగే మీడియా రంగంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఫేక్ న్యూస్, సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయని, వీటిని మెడిటేషన్ ద్వారానే శాశ్వతంగా పరిష్కరించుకోగలమని గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో శుక్రవారం జరిగిన మీడియా సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో “మీడియా, మెడిటేషన్ మరియు సామాజిక శాంతి” అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో దేశం నలుమూలల నుండిసుమారు 100 మంది ఎడిటర్లు, రిపోర్టర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు పాల్గొన్నారు.
*మీడియా బాధ్యత కీలకం*
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మీడియా సమాజానికి నాల్గవ స్తంభమని, దాని బాధ్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. “మీడియా స్వేచ్ఛ కోల్పోయినా, అసత్య వార్తలు ప్రచారం చేసినా, విభజన సృష్టించినా సమాజం బలహీనపడుతుంది. రాజయోగ ధ్యానం ద్వారా జర్నలిస్టులు తమలో శాంతిని పెంపొందించుకుంటే, సమాజంలోనూ శాంతిని నెలకొల్పగలరు” అని అన్నారు.
*అంతర్ముఖ శాంతి అవసరం*
హైదరాబాద్ జోన్ డైరెక్టర్ బీకే కులదీప్ దీదీ సదస్సును ఆశీర్వదిస్తూ మాటల శక్తి గొప్పదని చెబుతూ, మీడియా ద్వారా సానుకూల మార్పు తీసుకురావాలంటే అంతర్ముఖ శాంతి, పవిత్రత తప్పనిసరి అని సూచించారు. దేవునితో అనుసంధానం ద్వారా ఆత్మబలం పెంచుకుని సమాజానికి సానుకూలత పంచాలని పిలుపునిచ్చారు.
జాతీయ మీడియా కోఆర్డినేటర్ బీకే సుశాంత్ భాయీజీ మాట్లాడుతూ, “శాంతి మనలోనే ప్రారంభమవుతుంది. ఆత్మజ్ఞానం, పరమాత్మతో అనుసంధానం ద్వారా అంతరంగ శాంతి పొందితే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని బాధ్యతాయుతమైన కంటెంట్ సృష్టించవచ్చు” అని తెలిపారు.
*ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం*
ముంబైకి చెందిన డాక్టర్ సచిన్ పరబ్ మీడియా ప్రతినిధులకు ఆరోగ్య సూచనలు చేశారు. ఒత్తిడి వల్ల గుండె, రక్తపోటు, మెదడు పనితీరు దెబ్బతింటుందని చెబుతూ, విశ్రాంతి, సమతుల్య ఆహారం, నియమిత జీవనశైలి, నిద్రకు ముందు మొబైల్ వినియోగం తగ్గించడం అవసరమన్నారు. మానసిక, భావోద్వేగ, శారీరక, సామాజిక ఆరోగ్యాల సమన్వయమే సంపూర్ణ ఆరోగ్యమని వివరించారు.
*ఫేక్ న్యూస్‌పై ఆందోళన*
డక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ మాట్లాడుతూ, డబ్బు, పేరు కోసం పరుగులు తీస్తూ మనుషులు శాంతిని కోల్పోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం వల్ల ఫేక్ న్యూస్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీస్ సేవలను ప్రశంసిస్తూ, పిల్లలు, వృద్ధులకు విలువలపై తరగతులు నిర్వహించాలని సూచించారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ వర్మ “సత్యం, శివం, సుందరం” మరియు “బహుజన హితాయ, బహుజన సుఖాయ” సూత్రాలను మీడియా పాటించాలని కోరారు. సానుకూల వార్తల ద్వారా మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి ఆశ కల్పించవచ్చని తెలిపారు.
మౌంట్ అబూ ప్రధాన కార్యాలయం నుండి మీడియా వింగ్ చైర్పర్సన్ రాజయోగి బీకే కరుణ భాయ్ జి సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. సీనియర్ రాజయోగ టీచర్లు సిస్టర్ అంజలి, సిస్టర్ ఉమా రాణి ఒత్తిడి నిర్వహణ, ధ్యాన విధానం, దాని ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్ మీడియా కోఆర్డినేటర్ బీకే కవిత, బి.కె చిత్ర
సీనియర్ రాజయోగ ప్రతినిధులు బికె అరుణ్ బి కే వంశీ బాయిజీలు తదితరులు అనేక మంది పాల్గొన్నారు
విలువలతో కూడిన మీడియా, అంతరంగ శాంతి సమాజంలో సౌహార్దాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయని సదస్సు స్పష్టం చేసింది.

