కొడవలూరులో వీబీ-జీ రామ్‌జీ పథకం ప్రారంభం. రెండేళ్లలో కేంద్రం నుండి రూ.14 లక్షల కోట్ల నిధులు వచ్చాయన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కొడవలూరు మండలం రామన్నపాళెం పంచాయతీలో వీబీ జీ రామ్ జీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎన్నో ఆర్థిక సమస్యలతో ఉన్న ప్రజలు కూటమి ప్రభుత్వానికి అప్పగించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్లలోనే ఎన్నికల హామీలలో అత్యధిక భాగాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాల్సిన మనకు కొత్త దిశను చూపిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప సహకారం అందించారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉండటం వల్ల గత రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి లభించాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ప్రశాంతి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్‌జీ పథకం అధికారిక జాతీయ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసిందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా పంట నాట్లు, కోత సమయంలో 60 రోజుల పని విరామం కల్పించడంతో పాటు, గ్రామీణ పేదలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు రోజువారీ కూలీని రూ.312గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, గతంతో పోలిస్తే రూ.5 పెంపు చేసినట్లు తెలిపారు. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఈ-కేవైసీ ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులే చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకుంటే సరిపోతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


