ముస్తాబాద్ మే 13 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల రైతుల సమస్యలపై మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు వినతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాల్లో రైతులు కోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచినప్పటికీ, లారీలు మరియు హమాలీల కొరత కారణంగా ధాన్యం రైస్ మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎన్నో రోజుల శ్రమతో పండించిన ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలంలోని ధాన్యం పూర్తిగా తరలించే వరకు ఇతర మండలాల నుంచి వచ్చే లారీలను నియంత్రించి, స్థానిక రైతుల ధాన్యాన్ని ప్రాధాన్యతగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వెంటనే ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

