వేంసూరు / ఖమ్మం
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫొటోలు మాత్రమే ముద్రించడాన్ని బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాలా నాగ సురేంద్ర రెడ్డి తప్పుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం అందిస్తున్నందున ఆయన ఫొటోను రేషన్ కార్డుపై ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ ఫొటో వేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు తొలగించి, లబ్ధిదారుల కుటుంబ ఫొటోలు ముద్రించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొర్ల ప్రభాకర్ రెడ్డి, ఐటీ సెల్ కన్వీనర్ నల్లమోతు నాని బాబు, మండల కార్యదర్శులు బండి వెంకటరెడ్డి, బండి ఆంజనేయులు, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, మాదిరాజు శ్రీనివాస్, కిన్నెర మహేష్, జొన్నలగడ్డ నవీన్, చల్లా అప్పిరెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, భీమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



