…ఉద్యాన రంగ అభివృద్ధితో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు
రైల్వేకోడూరు : రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో అక్టోబర్ 2న మదనపల్లిలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముక్కావారిపల్లె పంచాయతీలో రైతులతో కలిసి వనభోజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధికి రూ.1,000 కోట్లు, రైల్వేకోడూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ ద్వారా ఆధునిక సాంకేతికత, మెరుగైన మార్కెట్ అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


