రంగంపేట, జూలై 25 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉండవల్లి సత్యనారాయణ మెమోరియల్ జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కింద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
నాలుగు మండలాల్లో 31,319 మంది విద్యార్థులకు లబ్ధి
అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 31,319 మంది విద్యార్థులకు రూ.40.71 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసిందన్నారు.
ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేయడం ద్వారా విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేయడం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు.
తల్లి లేని అనాథ పిల్లల విద్య, సంరక్షణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యా వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలల్లో మెరుగైన వాతావరణం, ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. స్మార్ట్ బోర్డులు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల చదువు, భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, రంగంపేట మండల కూటమి నాయకులు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




