పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట విషాదం.. కుటుంబ సభ్యుల కన్నీటి రోదనలు
పెందుర్తి: పెళ్లి పందిరిలో మంగళవాయిద్యాలు మోగాల్సిన వేళ.. మృత్యువు కబళించడంతో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రిగడ్డ డ్యామ్‌లో జెరిపోతుల శివ ప్రసాద్ (48) మృతదేహం లభ్యమైంది.
పెందుర్తు శివసాయినగర్ కాలనీకి చెందిన వరప్రసాద్ సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. డ్యామ్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్ 112కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే.. ఇంట్లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. పెళ్లి సందడితో ఉండాల్సిన ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి రోదనలు స్థానికులను కలచివేశాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఆనందం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఒక్కసారిగా మృత్యువార్త రావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

