విశాఖపట్నం జిల్లా, ఆనందపురం:( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్మ 30::: వాసవ్య హిళా మండలి ఆధ్వర్యంలో, లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో సంత్వనా కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలం బోని గ్రామంలో మానసిక ఆరోగ్యంపై కమ్యూనిటీ అవగాహన, సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జశ్వంత్ మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని, సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి వైద్య సహాయం పొందాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ మాట్లాడుతూ, మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించి బాధితుల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కోరారు. నాగవంశం అధ్యక్షులు సత్యవర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ వాసవ్య మహిళా మండలి అందిస్తున్న సేవలను అభినందించారు.
వాసవ్య మహిళా మండలి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలు, చికిత్సా విధానాలు, కుటుంబ సభ్యులు అందించాల్సిన సహకారంపై వివరించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం. నాగరాజు సంత్వనా కార్యక్రమం ద్వారా బాధితులను గుర్తించడం, వైద్య చికిత్సకు రిఫర్ చేయడం, కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం వంటి సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యులు నారాయణ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య అధికారులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్లు తదితరులు కలిపి సుమారు 50 మంది పాల్గొన్నారు. సంత్వనా కమ్యూనిటీ యానిమేటర్లు పావని, రమణి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. గ్రామస్థులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది.


