“భూమి కోసం కాదు… భవిష్యత్తు కోసం పోరాటం”
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమానికి కవుల సరస్వతి పిలుపు
యాచారం, జూన్ 11:
“ఎన్ని సమస్యలు వచ్చినా… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… చివరి వరకు పోరాటం చేస్తాను. ఇది కేవలం కొన్ని ఎకరాల భూమి కోసం చేస్తున్న పోరాటం కాదు. మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం, మన హక్కులు, మన భవిష్యత్ తరాల కోసం చేస్తున్న పోరాటం” అని సామాజిక కార్యకర్త కవుల సరస్వతి అన్నారు.
భారత రాజ్యాంగం “We The People” అనే పదాలతో ప్రారంభమవుతుందని గుర్తు చేస్తూ, దేశంలో అసలైన అధికారం ప్రజలదేనని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ప్రజల పన్నుల ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు, పోలీసులు ప్రజల సేవకులుగా పనిచేయాలని, కానీ ప్రస్తుతం అనేక చోట్ల పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భూములు, సహజ వనరులు, హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని, సామాన్య ప్రజల ఆస్తులను హరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీల పేరుతో ప్రజలను విభజించి పాలించే విధానాలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.
“మన భూమి మన చేతుల్లో లేకపోతే మన ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన గ్రామాల కోసం, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అందరూ ఒక్కటిగా నిలబడాలి. ఈ పోరాటం నాది మాత్రమే కాదు… ప్రజలందరిదీ” అని ఆమె పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ప్రజలు ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని, తమ హక్కుల కోసం నిర్భయంగా ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రజలందరూ ఐక్యంగా పోరాడితేనే మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
“నేను చివరి వరకు పోరాటానికి సిద్ధమే… మీరు సిద్ధమేనా?”
— కవుల సరస్వతి
ప్రజల హక్కుల కోసం… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… సమిష్టి పోరాటమే మార్గం.



