కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని డాక్టర్ బాబా జగ్జీవన్ రామ్ రీడింగ్ రూమ్ విషయంలో రేగుంట కేశవరావు గారు చేస్తున్న వ్యాఖ్యలు, డిమాండ్లు పూర్తిగా అనుచితమని టీఎస్ ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
శ్రీమతి ఎమ్మెల్యే కోవలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చదువులో ముందుకు వెళ్లాలని లక్ష్యంతో ఈ రీడింగ్ రూమ్ నిర్మించబడింది. ఇది చదువుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఉపయోగ భవనం. అలాంటి రీడింగ్ రూమ్‌ను వృద్ధులు, వితంతువుల సమావేశాలు లేదా ప్రెస్మీట్ల కోసం మాకు అప్పగించాలంటూ కోరడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ప్రజలే ఆలోచించాలి.
వృద్ధులు, వితంతువుల సమస్యలు నిజంగా ప్రజా సమస్యలైతే వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అధికారులను కలవడం, ప్రజా వేదికలపై మాట్లాడడం స్వాగతించదగిన విషయం. కానీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్‌ను తమ ఆధీనంలోకి ఇవ్వాలని కోరడం సరైన విధానం కాదు.
గత 30 సంవత్సరాలుగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని చెప్పుకునే నాయకులు ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలి గానీ, సమాజానికి ఉపయోగపడుతున్న భవనాలపై వివాదాలు సృష్టించడం మానుకోవాలి.
ఈ రీడింగ్ రూమ్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది ప్రజలందరికీ సంబంధించిన సామాజిక ఆస్తి. దీనిని రాజకీయ లేదా వ్యక్తిగత ఆధిపత్య వేదికగా మార్చే ప్రయత్నాలను టీఎస్ ఎంఆర్పీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు.
— శనిగరపు మల్లేష్రాష్ట్ర కార్యదర్శి, టీఎస్ ఎంఆర్పీఎస్


