ఖమ్మం, మే
( పున్నమి జిల్లా ప్రతి నిధి )
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఖమ్మం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి బి. శ్రీనివాసరావు బుధవారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, 2023 మే 28న ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు (40) ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.279/2023గా కేసు నమోదు చేశారు.
పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించి శిక్ష విధించింది.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు నిర్వహించిన ఎస్సై వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం. ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం. వెంకయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోం గార్డు చిట్టిబాబును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.



