ఖమ్మం: పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అంతర్రాష్ట్రాలకు తరలిస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మీర్జా జిలానీ బేగ్ (48)పై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న జిలానీ బేగ్‌పై తల్లాడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. BNS, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్ కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు కేసులు నమోదై, BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసినా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదని సీపీ తెలిపారు. దీంతో పీడీ యాక్ట్ అమలు చేసి వైరా సీఐ వెంకట ప్రసాద్, తల్లాడ ఎస్సై వెంకట కృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు. పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలు, నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ సునీల్ దత్ స్పష్టం చేశారు.



