ఖమ్మం, మే
(పున్నమి జిల్లా ప్రతినిధి)
దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన మెడికల్ షాపుల బంద్‌కు ఖమ్మం నగరంలోని మెడికల్ షాపుల యాజమాన్యం కూడా భారీగా మద్దతు తెలిపింది. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని, మెడికల్ రంగంలో పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఉదయం నుంచే ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాల్లో అనేక మెడికల్ షాపులు మూతపడడంతో ప్రజలకు ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అత్యవసర సేవలను మాత్రం కొన్ని దుకాణాలు పరిమిత స్థాయిలో కొనసాగించాయి.
మెడికల్ షాపుల యాజమాన్యం మాట్లాడుతూ, ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాల కారణంగా చిన్న స్థాయి మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్న స్థానిక మెడికల్ షాపుల ఉనికి ప్రమాదంలో పడుతోందన్నారు. ఔషధాల విక్రయం అనేది సాధారణ వ్యాపారం కాదని, ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న కీలక అంశమని పేర్కొన్నారు.
ఇక కార్పొరేట్ సంస్థలు మెడికల్ రంగంలో విస్తరిస్తుండటంతో చిన్న వ్యాపారులు పోటీ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. భారీ డిస్కౌంట్లు, ఆన్‌లైన్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తూ స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై కఠిన నియంత్రణలు విధించాలని డిమాండ్ చేశారు.
బంద్ సందర్భంగా పలువురు మెడికల్ షాపుల నిర్వాహకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ బంద్ కారణంగా కొంతమంది ప్రజలు మందుల కోసం ఇబ్బందులు పడినప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందుబాటులో ఉండేలా కొన్ని మెడికల్ షాపులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.


