*మహోత్సవాలకు మహా సన్నాహాలు…*
– *మూడు ప్రధాన ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు*
– *ఎంతమంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు*
– *అధికారులు ప్రణాళికాయుత సమన్వయంతో పనిచేయాలి*
– *ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
విజయవాడకు ప్రత్యేకమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు సరస్ అజీవిక మేళా, విజయవాడ ఉత్సవ్–2.0 కూడా ఒకేసమయంలో జరగనున్న నేపథ్యంలో సమన్వయ శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేయాలని.. ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులతో సమావేశ మయ్యారు. ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు హాజరుకానున్నారని.. అదే సమయంలో సామాన్య భక్తులు, సందర్శకులకు పెద్దపీట వేస్తూ చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంకా ఏవైనా పనులు మిగిలియుంటే యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా నిర్వర్తించాలని సూచించారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శన అనుభవం కల్పించడంతో పాటు వారికి నగర పర్యటన ప్రత్యేక ఉత్సవాల ద్వారా మధురానుభూతులను మిగిల్చేలా చూడాలన్నారు. సరస్ మేళాలో దేశం నలుమూలల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులతో దాదాపు 650 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని.. అదే విధంగా వినూత్న కార్యక్రమాలతో విజయవాడ ఉత్సవ్ వేదిక కానుందన్నారు. ప్రముఖుల పర్యటనలు, వేదికల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్, క్రీడాపోటీలు తదితరాలపైనా సమావేశంలో చర్చించి.. ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాల నిర్వహణను విజయవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
(సమాచార, పౌర సంబంధాల శాఖ, ఎన్టీఆర్ జిల్లా ద్వారాజారీ)

