*డీఎస్సీపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఖండించిన జగ్గంపేట డీఎస్సీ అభ్యర్థులు*
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతి పత్రం అందజేత*
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 16: గోకవరం రోడ్డులో ఉన్న కాపు సామాజిక భవనంలో ఆదివారం డీఎస్సీ అభ్యర్థుల సంఘీభావ సమావేశం ఘనంగా జరిగింది.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు ఉన్నాయి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను అభ్యర్థులు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం సరికాదని, ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న డీఎస్సీ ప్రక్రియకు తమ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన డీఎస్సీ అభ్యర్థులు మరియు నిరుద్యోగ యువత స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పలువురు డీఎస్సీ విద్యార్థులు మాట్లాడుతూ
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంవత్సరాల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకంతో 16500 మందికి డీఎస్సీలో అవకాశం కల్పించారని అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. విద్యార్థుల అవసరాలు మరియు ఉపాధ్యాయ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అత్యంత కీలకమైన అంశంగా వయోపరిమితి దాటిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి జీవనోపాధి కోసం ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు, సంస్థల్లో కనీసం 50% రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతిపక్షం చేస్తున్న అనవసర రాద్ధాంతం పై ఒక సమావేశం నిర్వహించుకుని డీఎస్సీ విద్యార్థులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారని
ఈ వినతులన్నింటినీ నిషితింగా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించి ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి 35 వేలకు తగ్గకుండా జీతాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.



