విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ – డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన నాయకులు
ఆత్మకూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి): డీఎస్సీ-2026 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలను నిరసిస్తూ, మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు ఆత్మకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగే విధానాలను విరమించి, అన్ని నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


