*స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలు తవ్విన మంత్రి కొల్లు, ఎమ్మెల్యే యార్లగడ్డ*
గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్
గన్నవరం నియోజకవర్గం చిన్న ఆవుటపల్లి గ్రామంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “జలధార – జల హారతి” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలను తవ్వారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జల మట్టాన్ని సగటున 6 మీటర్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్షపు బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఎంక్వైరీ చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గన్నవరం అభివృద్ధినే అజెండాగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల కారణంగా చెరువుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని 36 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, మైనింగ్ నిధుల ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలు తమ పొలాలు, ఇళ్ల స్థలాలు మెరక చేసుకునేందుకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా మట్టిని తరలించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గన్నవరం ప్రాంతంలో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సుమారు 9 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేంద్ర నిధులతో సీ-డాక్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో 30 ద్వారా మంగళగిరి తరహాలో గన్నవరంలో 900 మందికి ఇళ్ల పట్టాలు అందజేసి, మరింత మందికి పంపిణీకి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పి నైనవరం గ్రామంలో కృష్ణ యూనివర్సిటీ కోసం భూమి కేటాయించినట్లు, నియోజకవర్గవ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



