విద్యుత్ దీపాలు అమర్చుతూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన మున్సిపల్ మల్టీపర్పస్ కార్మికుడు భూక్యా జైత్రామ్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వైద్యులను ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంగపేట 23వ డివిజన్‌కు చెందిన జైత్రామ్ విద్యుత్ స్తంభంపై దీపం ఏర్పాటు చేస్తుండగా జారి కిందపడ్డారు. తొలుత కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని మమత జనరల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన కూనంనేని జైత్రామ్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిపుణులైన వైద్యులతో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.



