*కాకినాడ జిల్లాలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష*
• పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం
• అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
• రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలి
• అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి
• పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచన
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులి కదలికలపై అటవీ శాఖ, ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
*శాఖల సమన్వయంతో నిరంతర నిఘా*
పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.


