మండలంలోని బొగ్గిడివారిపల్లె పంచాయతీ పరిధిలోని పాలకొండ్రాయినపల్లెలో గణనాథుడి 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.తొమ్మిది రోజులుగా మండపంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మంగళవారం గణనాథుడి నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు.నిమజ్జనానికి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్,ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు మండల అధ్యక్షుడు రాజశేఖర్, క్లస్టర్ ఇన్చార్జ్ రాజానాయుడు, నియోజకవర్గ రైతు విభాగం కన్వీనర్ మల్లు వెంకటసుబ్బారెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నాగమునిరెడ్డి, పార్ల శ్రీనివాసులు తదితరులు హాజరై గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా పాలకొండ్రాయినపల్లెలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ ఉత్సవాలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో మండల, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రామ ప్రజలు ఐకమత్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనానికి తరలించారు. భక్తులు గణపతి నామస్మరణలు, జై గణేశ్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


