ఒంగోలు వైభవాన్ని భావితరాలకు అందించాలి: వెంకయ్యనాయుడు
ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1977లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తుచేశారు. రాజకీయాల్లో ధనబలం కంటే వ్యక్తిత్వం, సామర్థ్యం, నడవడికకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఒంగోలు గిత్త జాతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్వచ్ఛత, ప్రకృతి పరిరక్షణకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. 150 ఏళ్ల చరిత్రను గౌరవిస్తూ ఒంగోలు భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. నగరాభివృద్ధిలో తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, గృహవసతికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమని గవర్నర్ పేర్కొన్నారు. గత వైభవాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒంగోలును అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.



















