మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక ‘మహానాడు’ వేడుకలు సరికొత్తగా, వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 27, 28, 29 తేదీలలో జరిగే ఈ వేడుకలను ఈసారి ‘హైబ్రిడ్’ విధానంలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ తర్వాత భౌతికంగా, వర్చువల్‌గా ‘జూమ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా లక్షలాది మంది ఆన్లైన్లో పాల్గొంటూ ఇదొక రికార్డుగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 1,851 చోట్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరుగుతున్న ఈ మహానాడులో మొత్తం 65 మంది వక్తలు ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10, తెలంగాణకు చెందిన 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానంతో కలిపి మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది.


