శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తా : ఎస్సై జంపని కుమార్
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా జంపని కుమార్ నేడు విధుల్లో చేరారు. గతంలో దగదర్తి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన, సాధారణ బదిలీల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై జంపని కుమార్‌కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్టేషన్‌లోని అధికారులు, సిబ్బందితో సమావేశమై స్థానిక పరిస్థితులపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా ఎస్సై జంపని కుమార్ మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత విశ్వాసం కలిగేలా పనిచేస్తానన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
అలాగే ప్రజలు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నేర నియంత్రణతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతియుత వాతావరణం నెలకొనేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్సై జంపని కుమార్ స్పష్టం చేశారు.


