విశాఖపట్నం జిల్లా,,పెందుర్తి, (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 30:: వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో సాంత్వన కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండలం మహాలక్ష్మి నగర్ సచివాలయంలో మానసిక ఆరోగ్యంపై కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సచివాలయ అడ్మిన్ ఎం. కుమారి మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి వైద్య సహాయం పొందాలని సూచించారు. మహిళా పోలీస్ డి. అరుణ మాట్లాడుతూ మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించి బాధితులకు సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వాసవ్య మహిళా మండలి ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. అబ్రహం మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలు, చికిత్సా విధానాలు, కుటుంబ సభ్యులు అందించాల్సిన సహకారంపై అవగాహన కల్పించారు. సాంత్వన కార్యక్రమం ద్వారా బాధితులను గుర్తించడం, వైద్య చికిత్సకు రిఫర్ చేయడం, అవసరమైన సహాయం అందించడం, కుటుంబ సభ్యులకు మద్దతు కల్పించడం వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, చర్చి పాస్టర్లు, ఆలయ పూజారులు, ఆరోగ్య అధికారులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్లు తదితరులు సుమారు 50 మంది పాల్గొన్నారు. సాంత్వన ప్రాజెక్ట్ సూపర్వైజర్ వెంకట కృష్ణ, నాగరాజు, కమ్యూనిటీ యానిమేటర్లు ప్రియాంక, మల్లేశ్వరి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.


