*రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడుమూడి గ్రామంలో ఉడుముడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘ మహాజన సభ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎంతో కీలకమైనవని అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో రుణ సదుపాయాలు అందించడంతో పాటు, వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన సంఘం చైర్మన్, సభ్యులు, సిబ్బంది, అలాగే హాజరైన రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు సంఘం ద్వారా పొందుతున్న రుణాలను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలని సూచించారు. రుణాలను సక్రమంగా చెల్లించడం ద్వారా సంఘం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, తద్వారా భవిష్యత్తులో మరింత మంది రైతులకు రుణ సదుపాయాలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు
అనంతరం రైతులకు బ్యాంకు పాస్‌బుక్కులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, సిబ్బంది, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


