కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
పేదలు,బడుగు బలహీన వర్గాల సంక్షేమం ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు.ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను అక్కడికక్కడే తెలుసుకుని పరిష్కరించేందుకు ‘మినీ ప్రభుత్వం మీ వద్దకే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు,ప్రభుత్వ సేవలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గంలోని 9, 10, 11, 12, 13వ వార్డుల పరలోవపేట ఏఎంజీ స్కూల్ వద్ద నిర్వహించిన ‘మినీ ప్రభుత్వం మీ వద్దకే’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడారు. కార్యక్రమానికి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
*ప్రతి నెలా ప్రజల వద్దకే పెన్షన్లు*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లే విధానాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ప్రతి నెలా నిర్ణీత సమయంలో ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు.అర్హత ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
*చిన్నారుల పోషణపై ప్రత్యేక శ్రద్ధ*
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని అర్హులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలకు తొలి సంవత్సరాలు ఎంతో కీలకమని, ఈ దశలో పోషణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మాజీ మంత్రి చక్కల రామచంద్రరావు సూచించారు.
*దుమ్ములపేటలో హైస్కూల్ ఏర్పాటుకు కృషి*
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కొండబాబు తెలిపారు. దుమ్ములపేట ప్రాంతంలో హైస్కూల్ ఏర్పాటుకు స్థల సేకరణ, ప్రతిపాదనల ప్రక్రియ ఇప్పటికే చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలల ఏర్పాటుపై జరుగుతున్న పరిశీలనలో దుమ్ములపేటకు హైస్కూల్ తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పిల్లల చదువులే వారి భవిష్యత్తుకు పునాది అని, తల్లిదండ్రులు వారిని ఉన్నతంగా చదివించాలని సూచించారు. విద్యతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.
*గంజాయి నియంత్రణకు ప్రత్యేక ఈగల్ టీమ్స్*
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖకు అదనంగా ప్రత్యేక ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీసులు తమ సాధారణ విధుల్లో నిమగ్నమై ఉండే సమయంలోనూ గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు ఈ బృందాలు పనిచేస్తాయని చెప్పారు.ఈగల్ టీమ్స్ నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తాయని తెలిపారు. గంజాయి,మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రత్యేక బృందాలకు తెలియజేయాలని ప్రజలను కోరారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
*అర్హతే ప్రాతిపదికగా సంక్షేమం*
మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అర్హత ఆధారంగా అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నిర్ణీత సమయంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.గతంలో రూ.3 వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి అందిస్తున్నట్లు చెప్పారు.తల్లికి వందనం, ఇళ్ల నిర్మాణం,మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఐసీడీఎస్,అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల పోషణ, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన పలు సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించి ప్రజలకు అందించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
*ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం*
డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై వివిధ శాఖల అధికారులను అందుబాటులోకి తీసుకురావడమే ‘మినీ ప్రభుత్వం మీ వద్దకే’ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
తొలిసారిగా 9 నుంచి 13వ వార్డులను ఎంపిక చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను స్వీకరిస్తున్నారని తెలిపారు.
పెన్షన్లు, ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు తదితర సేవలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.ఇప్పటికే ఆన్లైన్లో నమోదైన పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఆధారంగా దశలవారీగా మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు
*డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి*
వార్డుల్లో డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, వీధులు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కూడా ప్రజలు కార్యక్రమంలో అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎస్ఈ పి. వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి, గదుల సాయిబాబా,పెంకే శ్రీనివాస్ బాబా,తుమ్మల సునీత, తుమ్మల రమేష్,ఓమ్మి బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వి చరణ్,మిషన్ మేనేజర్ డి. వెంకట్రాజు,టిపిఆర్ఓ సతీష్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.



