బంగాళాఖాతంలో మరోసారి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఈ నెల 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.* ఈ అల్పపీడనం తదుపరి రోజుల్లో మరింత బలపడి.. ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు తీరంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు మధ్య ఒడిశా ప్రాంతంలో కూడా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ద్వంద్వ ఆవర్తనాల ప్రభావంతో రాగల కొద్దిరోజుల్లో వివిధ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి, విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే తదుపరి హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

