Monday, 28 September 2026

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

బిక్కవోలు ఊలపల్లిలో ముంపు ప్రాంతాల పరిశీలన

బిక్కవోలు, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన బిక్కవోలు, ఊలపల్లి గ్రామాల్లోని పంట పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత రైతులను పరామర్శించారు. ముంపు పరిస్థితులు, పంటలకు జరిగిన నష్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, సంబంధిత అధికారులు, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బిక్కవోలు, ఊలపల్లి గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

భారీ వర్షాలపై క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే నల్లమిల్లి

ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల పరిశీలన అనపర్తి, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): భారీ వర్షాల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలోని దుప్పలపూడి, అనపర్తి, బిక్కవోలు మండలం రంగాపురం, పెదపూడి మండలంలోని పలు ప్రాంతాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. దుప్పలపూడిలో స్వయంగా ట్రాక్టర్‌పై వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న భోజనం, టిఫిన్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నష్ట వివరాలతో నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించి, అర్హులైన బాధితులకు నష్టపరిహారం, అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

తూర్పు గోదావరి

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన నివాళులు

అనపర్తి, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సేవలను స్మరించుకున్నారు. దేశ సమగ్ర అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తిలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

– సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి అనపర్తి, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా హాస్పిటల్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి మెమొరాండం సమర్పించారు. అనపర్తి ఏరియా హాస్పిటల్‌కు రోజుకు 500 నుంచి 600 మంది వరకు ఔట్‌పేషెంట్లు వస్తున్నారని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 136 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనపర్తి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులపై ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇటీవల నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాల్లో ఈ అంశం స్పష్టమైందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే నియోజకవర్గంలో క్యాన్సర్‌ కేసుల శాతం అధికంగా ఉన్నట్లు పేర్కొంటూ, స్థానికంగా ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపు

అనపర్తి, సెప్టెంబరు 24 (పున్నమి ప్రతినిధి): క్యాన్సర్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గంలో క్యాన్సర్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. బలభద్రపురంలో నిర్వహించిన శిబిరంలో 380 మందికి పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఇటీవల నిర్వహించిన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌లో 51 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. సంస్కార ఫౌండేషన్‌, పింక్‌ ఇండియా ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సీఎస్‌ఆర్‌ నిధులతో నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి వైద్యం అందించేందుకు ఫౌండేషన్లు ముందుకు వచ్చాయని వెల్లడించారు.

తూర్పు గోదావరి

సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాల్సిందే: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, సెప్టెంబరు 24 (పున్నమి ప్రతినిధి): నియోజకవర్గంలో పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులను ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేయాల్సిందేనని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రాసిమ్, ఐటీసీ సంస్థలు చేపడుతున్న సీఎస్ఆర్ కార్యక్రమాలపై వివరాలు స్పష్టంగా ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాళ్ల వ్యయాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు. ఐటీసీ అందించిన విద్యా కిట్లకు, ఇతర కార్యక్రమాలకు నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలన్నారు. పరిశ్రమలకు సంబంధించిన హౌస్‌ ట్యాక్స్‌లను ఎంపీడీవో అధికారులు పరిశీలించి, పక్కాగా వసూలు చేయాలని సూచించారు. సీఎస్ఆర్ నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

శ్రీరామనవమికి రాష్ట్ర పండుగ హోదా కోరిన ఎమ్మెల్యే

తాడేపల్లి, సెప్టెంబరు 24 (పున్నమి ప్రతినిధి): దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్‌లతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను రాష్ట్ర స్థాయి రెండో పండుగగా ప్రకటించాలని కోరారు. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పుష్కరాల సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కలపరపు బుచ్చి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జాతీయ నులిపురుగుల నిర్మూలనపై అవగాహనకు కరపత్రాల ఆవిష్కరణ

అనపర్తి, సెప్టెంబర్ 23 (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 25న జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం అవగాహన కరపత్రాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కరపత్రాల ద్వారా సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

పదవీకాలం ముగిసిన ఎంపీపీ ఎంపీటీసీలకు ఘన సత్కారం

అనపర్తి, సెప్టెంబరు 23 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అనపర్తి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పదవీకాలం పూర్తవుతున్న అనపర్తి మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) అంసూరి సూర్యనారాయణతో పాటు మండల ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

విదేశాల్లో భారత్ వాణి వినిపిస్తున్న పురందేశ్వరి

అనపర్తి, సెప్టెంబరు 23 (పున్నమి ప్రతినిధి): భారతదేశం వాణిని విదేశాల్లో స్పష్టంగా వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఎంపిక చేయడం జరుగుతోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడంతో పాటు అనేక భాషలపై పట్టు, విషయ పరిజ్ఞానం పురందేశ్వరికి ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో ఆమె పర్యటించిన సందర్భంగా కాశ్మీర్‌కు సంబంధించి ‘ఆక్రమిత కాశ్మీర్’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి, కాశ్మీర్‌పై భారతదేశ వైఖరిని విదేశాల్లో స్పష్టంగా వినిపించారని తెలిపారు. ఈ విషయంలో ఆమె ప్రత్యేకంగా నిలిచారని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.