గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గౌరవ భృతి కల్పించాలి.. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలి.. నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు
పున్నమి: నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి మంజూరు చేయాలని నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యులు, ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత దూపం అంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైనదని తెలిపారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన వార్డు సభ్యులు తమ వార్డుల అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. వార్డు సభ్యులు ఎటువంటి నెలవారీ వేతనం లేదా గౌరవ భృతి లేకుండానే ప్రజాసేవలో కొనసాగుతున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తున్నారని తెలిపారు. దీంతో వార్డు సభ్యులు మరియు వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లకు ప్రభుత్వం వేతనాలు, గౌరవ భృతులు అందిస్తున్నట్లుగానే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు కూడా నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వార్డు సభ్యుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన ఆర్థిక భరోసా కల్పిస్తే మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని దూపం అంజనేయులు అన్నారు. కావున, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. “గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం” అనే నినాదంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి న్యాయం చేయాలని దూపం అంజనేయులు విజ్ఞప్తి చేశారు.





