తూర్పుగోదావరి జిల్లా,రాజమహేంద్రవరం,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్,మున్సిపల్ పరిపాలన సంచాలకుడు పి. సంపత్‌కుమార్ ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
జేఎన్ రోడ్డులోని సూర్య గార్డెన్స్‌లో గురువారం పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘మున్సిపల్ ఎన్నికలు–2026’ ఎన్నికల సంసిద్ధతపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాల పరిధిలోని ఏడు జిల్లాలు,25 పట్టణ స్థానిక సంస్థలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు,ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.తొలుత ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
*25 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల సన్నాహాలు*
రాజమహేంద్రవరం ప్రాంతీయ పరిధిలోని మొత్తం 34 పట్టణ స్థానిక సంస్థల్లో న్యాయస్థాన కేసుల పరిధిలో ఉన్న తొమ్మిదింటిని మినహాయించి, మిగిలిన 25 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు ముమ్మరం చేసినట్లు సురేష్‌కుమార్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మున్సిపాలిటీలు,నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.వార్డుల పునర్విభజన,ఓటర్ల జాబితాకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు.చట్టం–5, పరిసర గ్రామాల విలీనం,వార్డుల విభజన వివాదాలు, న్యాయస్థాన కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు.ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు తాజా ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా,ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు,దివ్యాంగుల కోసం ర్యాంపులు,విద్యుత్,వెలుతురు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
*నిబంధనలు పక్కాగా పాటించాలి*
సీడీఎంఏ పి. సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎలాంటి పొరపాట్లు, నిబంధనల ఉల్లంఘనలకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సూచించారు.ఓటర్ల జాబితా తయారీ,ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర అంశాల్లో నిర్దేశిత విధివిధానాలను కచ్చితంగా పాటించాలన్నారు.అధికారిక ఎన్నికల మార్గదర్శక పుస్తకంలోనూ ఓటర్ల జాబితాల తయారీ,పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన విధానాలు ఉన్నాయని తెలిపారు.ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను నిబంధనల మేరకు పక్కాగా సిద్ధం చేసి ప్రదర్శించాలన్నారు.పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను నిర్దేశిత విధానంలో సిద్ధం చేసుకోవాలని సూచించారు.రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల నియమాలను కచ్చితంగా అనుసరించాలన్నారు.16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు పట్టణ స్థానిక సంస్థలకు అందే క్రమంలో ఎన్నికల నిర్వహణ కూడా కీలక అంశమని సంపత్‌కుమార్ పేర్కొన్నారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిష్పక్షపాతంగా,తటస్థంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
*పోలింగ్ కేంద్రాలపై ముందస్తు పరిశీలన*
విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి ప్రాంతాల పరిశీలన,భవనాల కింది అంతస్తుల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుకూలత వంటి అంశాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమిది లక్షలకు పైగా జనాభా ఉండగా,64 వార్డులను ఇటీవల 86కు పెంచినట్లు తెలిపారు.
రిజర్వేషన్ల ప్రక్రియను వర్తించే జనాభా వివరాలు,ప్రభుత్వ నిబంధనలు,నిర్దేశిత విధివిధానాల మేరకు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
*పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ*
రాజమహేంద్రవరం నగరపాలక కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అధికారి తనకు అప్పగించిన ఎన్నికల బాధ్యతలను నిబంధనల మేరకు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పనిచేయాలన్నారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ముందస్తు కార్యాచరణను చేపట్టాలని సూచించారు.
*ఎన్నికల ప్రక్రియపై సమగ్ర శిక్షణ*
అనంతరం అదనపు సంచాలకుడు ఎస్. రవీంద్రబాబు దృశ్య ప్రదర్శన ద్వారా మున్సిపల్ ఎన్నికల సంసిద్ధత, నిర్వహణ ప్రక్రియపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, నోటిఫికేషన్ అనంతరం అనుసరించాల్సిన విధివిధానాలు,ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది విధులు,పోలింగ్ నిర్వహణ, ఎన్నికల సామగ్రి నిర్వహణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకుడు సీహెచ్ నాగ నరసింహారావు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఏ. భానుప్రతాప్,మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు,అదనపు కమిషనర్ (ఆర్ఎంసీ) పి.వి. రామలింగేశ్వర్,ఉప కమిషనర్ ఎస్. వెంకటరమణ, కార్యదర్శి శైలజవల్లి తదితరులు పాల్గొన్నారు.


