– వై.కోట గ్రంథాలయంలో విద్యార్థుల నివాళి
ఓబులవారిపల్లి: వై.కోట గ్రంథాలయంలో ప్రముఖ కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఎం. సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ గురజాడ అప్పారావు సమాజ సంస్కరణకు తన రచనల ద్వారా విశేష కృషి చేశారని తెలిపారు. బాల్యవివాహాలు, వెట్టిచాకిరీ, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఆయన రచనలు సాగాయని పేర్కొన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే సందేశంతో సమాజం పట్ల బాధ్యతను చాటిన మహాకవి అని కొనియాడారు. యువత, విద్యార్థులు గురజాడ రచనలను చదివి ఆయన ఆశయాలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఆయన జయంతి సందర్భంగా మహనీయుడిని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.


