కన్నీటి పర్యంతమైన హేమలత.. కొంగు చాచి ఓటు అభ్యర్థన!
20 ఏళ్ల క్రితం ప్రజలు అందించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ ప్రచారం.. మైలవరం అభివృద్ధికి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
మైలవరం ఎన్నికల ప్రచారంలో వైసీపీ మహిళా సర్పంచ్ అభ్యర్థి ఓర్సు హేమలత భావోద్వేగానికి గురయ్యారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ, కొంగు చాచి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 20 ఏళ్ల క్రితం మైలవరంలో 1,600 ఓట్ల భారీ మెజార్టీతో ప్రజలు తనను గెలిపించారని, అప్పట్లో పట్టణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేశానని గుర్తుచేసుకున్నారు. అయితే నియంత పాలకులమని చెప్పుకునే కొందరు ఏడాదిన్నర కాలంలోనే తమను పదవుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమలు చేసిన అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, నాడు-నేడు, పేదలందరికీ ఇళ్లు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. పేద కుటుంబాలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు ఆయా పథకాల ద్వారా అందిన ప్రయోజనాలను గుర్తుచేశారు.
ప్రస్తుతం మైలవరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, తాగునీటి సమస్య కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో తనకు అందించిన ఆదరణను మరోసారి చూపించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తనకు అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు.

