Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా దేశం ఐక్యత: మేడిపండు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా దేశం ఐక్యత: మేడిపండు

వార్త ముఖ్యాంశాలు

  • --పైకి అంతా ఓకే...
  • లోలోన మొత్తం నోకే --ఆధిపత్య పోరు --ఒకరిపై ఒకరు లోలోన కారాలు మిరియాలు --లోన అసమ్మతి...
  • పైకి సమ్మతి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మాత్రం లోలోన అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి.

–పైకి అంతా ఓకే… లోలోన మొత్తం నోకే
–ఆధిపత్య పోరు
–ఒకరిపై ఒకరు లోలోన కారాలు మిరియాలు
–లోన అసమ్మతి… పైకి సమ్మతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మాత్రం లోలోన అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. జిల్లా దేశం ఐక్యత మేడిపండు లెక్కన కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు లోలోన కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. కంటికి కనిపించకుండా గ్రూపు రాజకీయాలను నెరపుతున్నారు. ఈ రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా దేశంలో ఇటీవల కాలంలో ఆధిపత్య పోరు ఎక్కువైంది. అయితే ఈ తప్పంతా తమది కాదంటే తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి ఎదుగుదలను, ఆధిపత్యాన్ని మరొకరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం తమ సొంతం, తమ ఇష్టం, ఇక్కడ తమదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా మొత్తం విషయానికి వచ్చేసరికి తమ మాటే నెగ్గాలన్న భావనతో కొందరు, నెగ్గలేదనే బాధతో మరికొందరు లోలోపలే రగిలిపోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు జిల్లా రాజకీయాల్లో ప్రతి విషయంలో వేలు పెట్టి తమను నిర్లక్ష్యంగా చూస్తున్నారన్న భావన కొందరిలో మొదలైంది. దీంతోనే గ్రూపు రాజకీయాలకు బీజాలు పడుతున్నాయి.
ముఖ్యంగా జిల్లాలో మరో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డిని కొన్ని విషయాల్లో పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారన్న భావన ఆయన వర్గంలో మొదలైంది. ఇక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సైతం సరిగ్గా పట్టించుకోవడంలో పార్టీ అధిష్ఠానం అంతగా శ్రద్ధ చూపడం లేదన్న భావన ఆ వర్గంలో మొదలైంది. దీంతో ఇటీవల రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు తరచూ కలుస్తూ రహస్య మంతనాలు కొనసాగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ మంతనాల్లో ఏం జరుగుతోందన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతులు అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఎక్కువగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా దేశంలో ఒక భావన మొదలైంది. నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి ఎంపికలో, అలాగే జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఈ విషయాలు ప్రస్ఫుటమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో అందరికంటే తాను సీనియర్ అని, ఐదారు దశాబ్దాల రాజకీయ అనుభవం గల కుటుంబం నుంచి తాను వచ్చానని, ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, ఎన్నో మంత్రి పదవులు అనుభవించానని, ఓటమి గెలుపులను సమతూకంగా చూసిన అనుభవం తనకుందని అప్పుడప్పుడు తనకు తానే గొప్పగా చెప్పుకునే రామనారాయణరెడ్డి ఆ ఆలోచనల్లోనే ఉంటూ, జిల్లా రాజకీయాల్లో తన సూచనలు, సలహాలు తీసుకోవడం లేదన్న అంతర్మథనంలో ఉన్నారు. దీంతో ఆయన అప్పుడప్పుడు అసహనానికి కూడా గురవుతున్నారు. ఇటీవల ఆయన నిర్వహించే మీడియా సమావేశాల్లో ఈ అసహనం స్పష్టమవుతోంది. పేరుకు తన ప్రతిపక్ష నాయకుడు, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిపై విసుర్లు, కసుర్లు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, అందులో అంతర్లీనంగా తమ సొంత పార్టీ వారికి కూడా కొన్ని చురకలు వేస్తున్నట్లు నర్మగర్భ తీరులు స్పష్టమవుతున్నాయి.
ఇక కావలి ఎమ్మెల్యేగా దేశానికి చెందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనకు, ఆ ప్రాంతానికి చెందిన స్థానికుడు, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు మధ్య కనిపించాల్సినంత సఖ్యత కనిపించడం లేదు. ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డెమంటున్నారు. అనేక సంఘటనల్లో ఈ ఎడ్డెం తెడ్డెంలు కనిపిస్తున్నాయి. ఇక కావలి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే దగదర్తి మండల దేశానిది మరో దారిగా ఉంది. బీద సూచనలు, సలహాలతో ఈ ప్రాంత దేశం వారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఇప్పటికే దూరమై కనిపిస్తున్నారు.
ఇక నెల్లూరు నగరంలోనూ తెలుగుదేశం వారిలో కనిపించాల్సినంత సఖ్యత కనిపించడం లేదు. మంత్రి నారాయణ ఏకపక్ష వైఖరి, ఒంటెద్దు పోకడలతో నెల్లూరు నగరంలోనూ దేశంలో లుకలుకలు కనిపిస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సైతం ముక్కుసూటిగా ముందుకు పోతూ, తన నియోజకవర్గమైన కోవూరులోనే కాక జిల్లా రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకుంటుండడం దేశంలోని చాలామందికి సుతరామూ నచ్చడం లేదు. ఆమె తన విజయగర్వంతో ముందుకు సాగుతోందని, రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఎక్కువ విలువ ఇస్తూ, ఇతర సామాజిక వర్గాల వారు ఎంతటి తెలివైన చతురులైనా, కష్టించి పనిచేసేవారైనా వారికి మాత్రం తగిన విలువ, ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అటు తన సతీమణి మాటకు ఎదురు చెప్పలేక, సరైన సొంత నిర్ణయాలు తీసుకోలేక మల్లగుల్లాలు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇక మరో సీనియర్ నాయకుడిగా జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం తనకు జిల్లా దేశం తీసుకునే నిర్ణయాల్లో తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం ఇవ్వలేదనే ఆవేదనతో ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఆయన ఈ విషయాల్లో ఎక్కడా బయటపడకుండా గమ్మున రోజులు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ లో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి కాన వస్తుంది కారణం , గతంలో 5 ఏళ్ళ పాటు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నో కష్ట నష్టాలకోర్చి పార్టీ ని అంటి పెట్టుకొని ఉన్నామని అయితే పార్టీ అధికారంలోకి రాగానే అప్పట్లో వైసీపీ లో అధికారాన్ని అనుభవించిన చాలా మంది మళ్ళీ వచ్చి ఈ పార్టీ లో చేరి పెత్తనాలు కొనసాగిస్తున్నారని పార్టీ లో పదవులు కూడా పొందారని తాము మాత్రం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉన్నామనే భావన కొందరిలో ఉంది .
జిల్లా దేశంలో ఇంతటి అసంతృప్తి ఉన్నా, రగులుతున్న అగ్నిపర్వతాలను హృదయాల్లో ఉంచుకున్నా, బయటపడకుండా ఇంతవరకూ ఉన్నారంటే, దీనికి కారణం త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వారు విశ్వసించడమే. ఈ మంత్రివర్గ విస్తరణలో తమకేమైనా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండకపోతుందా అన్న ఆశతో కొందరు ఎదురుచూస్తున్నారు. అయితే పార్టీ మాత్రం మంత్రివర్గ విస్తరణ జోలికి ఇంతవరకూ వెళ్లలేదు. స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
ఏది ఏమైనా జిల్లా దేశంలో అనైక్యత కుంపటి రగులుతోంది. ఈ కుంపటిపై బాధ్యతతో కట్టుబడి కూర్చున్న నేతలు కూర్చోలేక, బయటికి పోలేక సతమతమవుతున్నారు. మరోవైపు జరగబోయే విస్తరణలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి ఉంటుందా, ఉండదా అన్న అనుమానాలు కూడా పలువురిలో ఉన్నాయి. రామనారాయణరెడ్డిని పదవి నుంచి తొలగిస్తే ఆ పదవి ఎవరికీ దక్కేనో, ఎవరి చేతికి చిక్కేనో అని మరికొందరు కాచుక్కూర్చున్నారు.
మంత్రివర్గ విస్తరణే జరిగితే ఆ పదవి కోసం జిల్లా నుంచి ముగ్గురు రేసులో నిలిచే అవకాశం ఉంది. అందులో ప్రథమ వరుసలో మహిళా కోటాలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాగా, ఆ తర్వాత వరుసలో శ్రీధర్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డిలు కనిపిస్తున్నారు. మరి ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. మంత్రివర్గ విస్తరణ జరిగేంతవరకూ, జిల్లా నూతన మంత్రి ఎవరో స్పష్టంగా తెలిసేంతవరకూ ఈ రగులుతున్న అసంతృప్తులు బహిరంగంగా గొంతు పెగిలి రాకపోవచ్చనే ఆలోచనలు కూడా తలెత్తుతున్నాయి. నూతన జిల్లా మంత్రి తేలిపోతే ఇక అప్పుడే రగులుతున్న అగ్నిపర్వతాలు బద్దలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *