వెల్వడం అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. తిరుమల విజ్ఞప్తి!
భర్త తోట తిరుపతిరావు సేవలను కొనసాగిస్తా.. ప్రతి కుటుంబానికి అండగా ఉంటా
మైలవరం మండలంలోని వెల్వడం గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి తిరుమల ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గతంలో తన భర్త, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తోట తిరుపతిరావు గ్రామ ప్రజలకు అందించిన సేవలను, కష్టసుఖాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ చేసిన సహాయ సహకారాలను గుర్తుచేస్తున్నారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా నిలవడమే తమ కుటుంబం లక్ష్యమని పేర్కొంటున్నారు.
ఇకపై కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో వీధి దీపాలు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని వివరిస్తున్నారు. గతంలో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు అందిన సంక్షేమ ఫలాలను ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆసరా, చేయూత వంటి పథకాలతో ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు తనకు ఒక అవకాశం కల్పించి సర్పంచిగా గెలిపించాలని తిరుమల గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెల్వడం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొంటున్నారు.
