Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నగరంలో దోమలు… బాబోయ్ దోమలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నగరంలో దోమలు… బాబోయ్ దోమలు!

వార్త ముఖ్యాంశాలు

  • - మసక పడితే మందలు మందలు - నిర్మూలన చర్యలు శూన్యం - నిద్రలేని జాగారాలు - కోట్లు ఖర్చు చేసుకుంటున్న జనం - దోమల నిర్మూలనలో చేతులెత్తేసిన కార్పొరేషన్ - స్ప్రేయింగ్, ఫాగింగ్ నిల్ - కనిపించని ఆయిల్ బాల్స్ - జాడలేని గంబూసియా చేపలు…
  • దోమల నిర్మూలన చర్యలు ఫైళ్లలోనే కనిపిస్తున్నాయి.
  • దోమల నివారణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చూపుతున్న కార్పొరేషన్, క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలను మాత్రం రాబట్టడం లేదు.

– మసక పడితే మందలు మందలు
– నిర్మూలన చర్యలు శూన్యం
– నిద్రలేని జాగారాలు
– కోట్లు ఖర్చు చేసుకుంటున్న జనం
– దోమల నిర్మూలనలో చేతులెత్తేసిన కార్పొరేషన్
– స్ప్రేయింగ్, ఫాగింగ్ నిల్
– కనిపించని ఆయిల్ బాల్స్
– జాడలేని గంబూసియా చేపలు
– ఫైళ్లలోనే దోమల నిర్మూలన
– నగరంలో ఎవరి చావు వారిది
నెల్లూరు నగరంలో దోమల నివారణ చర్యలు శూన్యమైపోయాయి. దోమల నిర్మూలన చర్యలు ఫైళ్లలోనే కనిపిస్తున్నాయి. దోమల నివారణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చూపుతున్న కార్పొరేషన్, క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలను మాత్రం రాబట్టడం లేదు. నగరంలో దోమల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మసక పడితే చాలు, మందలు మందలుగా దోమలు ప్రజలపై పడి దండయాత్రలు చేస్తున్నాయి. ప్రజల రక్తాన్ని జుర్రేస్తున్నాయి.

ఫాగింగ్, స్ప్రేయింగ్ ఫైళ్లలోనే కనిపిస్తుండగా, ఆయిల్ బాల్స్ అడ్రస్ ఉండటం లేదు. గంబూసియా చేపల జాడ కనిపించడం లేదు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకు నగరంలోని ఇళ్ల మధ్య ఉన్న వందలాది ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచి, ఆ నీరు మురిగి అక్కడ దోమల లార్వా పుట్టుకొస్తోంది. దీంతో కోట్ల, మిలియన్ల సంఖ్యలో దోమలు నగరంలో విపరీతంగా పెరిగిపోయాయి.

ప్రజలు ఆల్‌అవుట్‌లు, జెట్‌లు పెట్టుకుంటూ నిత్యం కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. ఒకప్పుడు గాలి కోసం ప్రజలు విసనకర్రలతో విసురుకునేవారు. ఇప్పుడు దోమల కోసం బ్యాట్లు పట్టుకొని విసురుతున్నారు. మరికొందరైతే వేల రూపాయలు ఖర్చు చేసుకొని కిటికీలకు, తలుపులకు మెష్‌లు బిగించుకుంటున్నారు. పొగలంతా ఎలా ఉన్నా, నెల్లూరు నగరంలో మసక పడుతోందంటే చాలు, లక్షలాది ప్రజలు దోమల భయంతో హడలిపోతున్నారు. నిద్రలేని జాగారాలు ప్రతి రాత్రీ శివరాత్రులను తలపిస్తున్నాయి.

దోమల నిర్మూలన చర్యలు అటకెక్కడం, ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచి చెత్త పేరుకుపోవడం, ఆ మురుగు నీటిలో లార్వా ఇష్టారాజ్యంగా ఉత్పత్తి అవుతుండటంతో ‘దోమలే దోమలు’ అన్న విధంగా కోట్ల దోమలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. నీరు నిల్వ ఉండే గుంతల్లో గంబూసియా చేపలు వదలాల్సి ఉండగా, ఆ ప్రక్రియ జోలికే కార్పొరేషన్ పారిశుధ్య అధికారులు పోవడం లేదు. ఇక నగరంలోని చిన్న చిన్న మురుగు కాలువల్లో సిల్ట్ పేరుకుపోయి, ఆ సిల్ట్‌లో నుంచి లార్వా పుట్టుకొస్తోంది.

పారిశుధ్యం క్రమేపీ క్షీణించడం నగర ప్రజలకు శాపంగా మారింది. దోమల నివారణపై మాటలు తప్ప చేతలు కనిపించడం లేదు. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, గడ్డి, చెట్లు మొలిచి, అలాంటి చోట్ల దోమలు పగటిపూట నివాసం చేస్తూ, రాత్రిళ్లు నగర ప్రజలపై మీసాలు మెలేస్తూ దండయాత్ర చేస్తున్నాయి. నగర పారిశుధ్య వ్యవస్థ దోమల నిర్మూలనలో చేతులెత్తేసినట్లు ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. నగరంలోని తూర్పు ప్రాంతాలైన బాలాజీ నగర్ , ఏ సి నగర్ , వేప దొరువు , ఎం ట్ ఆర్ నగర్ , ఎఫ్ సి ఐ కాలనీ , జాకీర్ హుస్సేన్ నగర్ , శ్రీనివాస్ నగర్ , రామ్ నగర్ , వైకుంఠపురం , సత్యనారాయణ పురం , బోడిగాడితోట , లక్ష్మి పురం , వీవెర్స్ కాలనీ , నవాబుపేట , బంగ్లా తోట , కుసుమ హరిజన వాడ , యనమల పాలెం , అల్లిపురం , చింతారెడ్డి పాలెం , రాజుపాలెం , ధనలక్ష్మి పురం , కలివెల పాలెం , సిరి గార్డెన్స్ , చెరుకూరు , నవలల గార్డెన్స్ , కోడూరు పాడు , నారాయణ రెడ్డి పేట , కొత్త కాలువ సెంటర్ , అశోక్ నగర్ , గుడపల్లిపాడు , గంగ టౌన్షిప్ తదితర ప్రాంతలలో దోమల బెదడ ఎక్కువగా ఉంది .

ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్ నుంచి ఎంహెచ్‌వో వరకు స్పందించి, యుద్ధప్రాతిపదికన దోమల నిర్మూలన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే నెల్లూరు నగరానికి ఉన్న సింహపురి పేరు కాస్తా మారి, దోమలపురిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *