*_షాబుఖారి దర్గాలో మొక్కు తీర్చుకున్న కూటమి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు_*
_బాబా వారి ఆశీస్సులతో విజయం సాధించామని వెల్లడి_
_అల్తాఫ్ బాబా కు ధన్యవాదాలు_
కొండపల్లిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఆశీస్సులతో… అల్తాఫ్ బాబా దీవెనలతో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందామని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వెల్లడించారు. శుక్రవారం వారు దర్గాను సందర్శించారు. మేళ తాళాలతో, అన్న ప్రసాదలతో దర్గాకు వెళ్లి చాదర్ సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ముందుగా అల్తాఫ్ బాబా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభుత్వం అండదండలతో ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. హజ్రత్ సయ్యద్ షాబుఖారి లంగర్ ఖానా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ ముందు దర్గాలో ప్రార్థించి తమను గెలిపించాల్సిందిగా మొక్కుకున్నామని… బాబా వారి ఆశీస్సులతో విజయం సాధించామని తెలిపారు. తమకు ఎప్పటి నుంచో దర్గాతో అనుబంధం ఉందని, ఇక్కడికి వస్తే తమకు శుభం జరుగుతుందని నమ్మకం అన్నారు. అందరూ కలిసి ఆత్మీయంగా తమకు అండగా నిలిచి విజయం సాధించేందుకు ఆశీర్వచనాలు అందజేసిన అల్తాఫ్ బాబా ను శాలువా కప్పి,పూల దండలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ 43వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ, 33వ డివిజన్ కార్పొరేటర్ స్నేహ సంతోష్, నందిగామ 22వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇమామ్ జానీ, కొండపల్లి 4వ వార్డు కౌన్సిలర్ భయ్యా సామ్రాజ్యం, 5వ వార్డు కౌన్సిలర్ అందె చిట్టిబాబు, 7వ వార్డు కౌన్సిలర్ నేహా, 15వ వార్డు కౌన్సిలర్ చెరుకు మహేష్, మహ్మద్ అఫ్సర్, తులసి, భయ్యా రామ, స్థానిక టీడీపీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

