గాజువాక, నవంబర్ 5 (పున్నమి ప్రతినిధి): దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాపై గాజువాక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో దశమకొండ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.40 వేల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు.
గాజువాక సీఐ సీహెచ్ వాసు నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ కె. రామకృష్ణ, విశాఖ సిటీ టాస్క్ఫోర్స్ ఎస్ఐ టి. రవికుమార్ తమ సిబ్బందితో కలిసి గురువారం దశమకొండ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వ ఉంచిన కోరాడ కరుణ (45)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సుమారు రూ.40 వేల విలువైన బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ నిల్వలపై కఠిన చర్యలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా బాణాసంచా కొనుగోలు చేయడం, విక్రయించడం, నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని సీఐ వాసు నాయుడు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా బాణాసంచా నిల్వ చేయవద్దని సూచించారు. దీపావళి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

