అక్రమ నిల్వలపై 100, 112కు సమాచారం ఇవ్వండి
విశాఖపట్నం, నవంబర్ 5 (పున్నమి ప్రతినిధి): దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. ఈ నెల 8న దీపావళి పండుగ నేపథ్యంలో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణసంచా దుకాణాలు, నిల్వ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బాణసంచా విక్రయాలకు లైసెన్స్ తప్పనిసరని, దుకాణాల ఏర్పాటుకు విద్యుత్, అగ్నిమాపక, జీవీఎంసీ శాఖల నుంచి అనుమతులు, నిరభ్యంతర పత్రాలు పొందాలని సూచించారు. దుకాణాల మధ్య కనీస భద్రతా దూరం పాటించాలని, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయరాదన్నారు. నిబంధనల ప్రకారం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని, 18 ఏళ్లలోపు వారికి బాణసంచా విక్రయించకూడదని స్పష్టం చేశారు.
ప్రతి దుకాణంలో ఇసుక బకెట్లు, నీరు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. దుకాణాల వద్ద జనసమూహాన్ని నియంత్రించడంతో పాటు కొనుగోలుదారులు క్యూలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని, ప్రజలు భద్రతా నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచించారు. బహిరంగ బాణసంచా ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు అగ్నిమాపక ఏర్పాట్లు, ప్రేక్షకులకు భద్రతా దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.
అక్రమ నిల్వలపై సమాచారం ఇవ్వండి
గాజువాక పరిసర ప్రాంతాల్లో అనధికారికంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 లేదా 112కు, గాజువాక ఏసీ ఫోన్ నంబర్ 9440796014కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
