భువనగిరి:
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద శ్రీ సావర్కర్ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పేద బ్రాహ్మణుల సమక్షంలో శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. పూజల్లో పాల్గొన్న మహిళలకు ఉత్సవ సమితి నిర్వాహకులు రత్నపురం శ్రీశైలం, బెండ శ్రీకాంత్ తాంబూలాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… భువనగిరి పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భవానీ దీక్షాపరులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, మహిళల కోసం ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మహిళలందరూ విరివిగా తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బెండ స్వరూప, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు బేతి కన్నయ్య, కాలేరు వినోద్ కుమార్, కాలేరు సందీప్, పోతన శ్రీధర్ లతో పాటు ఉత్సవ నిర్వాహకులు కామెడీ భరత్, కాలియా నాగరాజు, శీలం శ్రీనాథ్, రత్నాపురం వివేక్, తునికి కళ్యాణ్, ఊస బన్నీ, రత్నాపురం మణికంఠ, సందీప్, కాలే స్వాతి, శ్రీలత, షీలామిటో సన్నీ, మహేశ్వరి, సోమిగారి బాలు, రద్దుపల్లి అభి తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
