ఆపరేషన్ త్రిశూల్” కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ స్వయంగా పాల్గొని విద్యార్థులకు కీలకమైన సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఇటీవల చేపట్టిన “రైజ్ ఎగైనెస్ట్ గాంజా”లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇస్తే తగిన బహుమతి ఇస్తామని, అలాంటి సమాచారం ఉంటే 1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని మరియు అతివేగం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం వంటి నిర్లక్ష్య స్వభావాన్ని వీడాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తీవ్రమైన నేరమని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణ రక్షణ కోసమేనని వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, OTP వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని చెప్పారు. అలాగే అనధికారిక లోన్ యాప్‌ల ఉచ్చులో పడకూడదని మరియు మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. వేధింపులకు గురైతే భయపడకుండా 112 అత్యవసర నంబర్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.





